1 సమూ 10:1-6

1 సమూ 10:1-6 IRVTEL

అప్పుడు సమూయేలు నూనె బుడ్డి తీసుకు సౌలు తల మీద నూనె పోసి అతణ్ణి ముద్దు పెట్టుకుని “యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల మీద నిన్ను రాజుగా నియమించాడు” అని ఇంకా ఇలా చెప్పాడు, “ఈ రోజు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనిపిస్తారు. వారు ‘నువ్వు వెదకుతున్న గాడిదలు దొరికాయి. మీ నాన్న గాడిదల విషయం మరచిపోయి, నా కొడుకును వెదకడానికి నేనేం చెయ్యాలి, అని నీ కోసం బాధ పడుతున్నాడు’ అని చెబుతారు. తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్లి తాబోరు మైదానానికి రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని దగ్గరకి వెళ్లే ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు. వారిలో ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, మరొకడు ద్రాక్షారసపు తిత్తిని మోసుకుంటూ వస్తారు. వారు నీ క్షేమ సమాచారాలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు. వాటిని వారి నుండి నువ్వు తీసుకోవాలి. ఈ విధంగా వెళ్తూ ఫిలిష్తీయుల దండులో నివాసం ఉండే దేవుని కొండకు చేరతావు. అక్కడ ఊరి దగ్గరకి నువ్వు రాగానే, తంతి వాయిద్యాలు, తంబుర, సన్నాయి, సితారా వాయిస్తున్నవారు, వారి వెనుక ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు. యెహోవా ఆత్మ నీపైకి బలంగా దిగివస్తాడు. నువ్వు కూడా వారితో కలిసి ప్రకటిస్తూ ఉండగా నీకు నూతన మనస్సు వస్తుంది.