1 రాజులు 19:3-12

1 రాజులు 19:3-12 IRVTEL

ఏలీయా ఈ విషయం తెలుసుకుని, లేచి తన ప్రాణం కాపాడుకోడానికి, యూదాలోని బెయేర్షెబాకు వచ్చి, తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు. అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. “యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో” అని ప్రార్థన చేశాడు. అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు. ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు. అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు. అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్” అని అతనిని అడిగాడు. అతడు “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు. యెహోవా అతనితో “నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు” అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు. ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది.