1 రాజులు 19:15-21

1 రాజులు 19:15-21 IRVTEL

అప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “ఎడారి గుండా నీవు వచ్చిన దారిలో దమస్కు వెళ్ళు. అక్కడ సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి. ఇశ్రాయేలు వారి మీద నింషీ కొడుకు యెహూకు పట్టాభిషేకం చెయ్యి. నీకు బదులు ప్రవక్తగా ఉండడానికి అబేల్మెహోలా వాడు షాపాతు కొడుకు ఎలీషాకు అభిషేకం చెయ్యి. హజాయేలు కత్తిని తప్పించుకొనే వారిని యెహూ చంపేస్తాడు. యెహూ కత్తిని తప్పించుకొనే వారిని ఎలీషా చంపేస్తాడు. అయినా ఇశ్రాయేలు ప్రజల్లో బయలుకు మొక్కకుండా, వాడి విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఇంకా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు.” ఏలీయా అక్కడ నుండి వెళ్లిన తరువాత అతనికి షాపాతు కొడుకు ఎలీషా కనిపించాడు. అతడు తన దగ్గరున్న పన్నెండు జతల ఎడ్లతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ కాడి తానే తోలుతున్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్లి తన పైబట్టను అతని మీద వేశాడు. అతడు ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంట పరిగెత్తి “నేను వెళ్లి నా తలిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను” అన్నాడు. ఏలీయా “వెళ్లి రా. నేను నీకేం చేశానో గుర్తు పెట్టుకో” అన్నాడు. ఎలీషా అతన్ని విడిచి వెళ్లి, కాడి ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతనికి సేవకుడయ్యాడు.