1 యోహాను పత్రిక 2:18-29
1 యోహాను పత్రిక 2:18-29 IRVTEL
పిల్లలూ, ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నారు కదా, అయితే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీన్నిబట్టి ఇది ఆఖరి ఘడియ అని మనకు తెలుస్తూ ఉంది. వారు మన దగ్గర నుండి వెళ్ళారు గాని మనవాళ్ళు కాదు. మనవాళ్ళే అయితే మనతోనే ఉండిపోయేవారు. బయటకు వెళ్ళిపోవడం ద్వారా వారు మనకు సంబంధించినవారు కాదని కనబడుతూ ఉంది. కాని, మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. అందుచేత మీ అందరికీ సత్యం తెలుసు. మీకు సత్యం తెలియదు అనే ఉద్దేశంతో నేను మీకు రాయలేదు. సత్యం మీకు తెలుసు. సత్యం నుండి ఏ అబద్ధమూ రాదు కాబట్టి మీకు రాస్తున్నాను. యేసే క్రీస్తు అని అంగీకరించని వాడు గాక మరి అబద్ధికుడు ఎవరు? తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించేవాడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే. కుమారుణ్ణి ఒప్పుకున్న వాడికి తండ్రి ఉన్నట్టే. మీరైతే, మొదటినుంచి ఏది విన్నారో అది మీలో నిలిచిపోయేలా చూసుకోండి. మొదటినుండీ విన్నది మీలో అలాగే నిలిచి ఉంటే, మీరు కుమారుడిలో, తండ్రిలో నిలిచి ఉంటారు. ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు. ఇవన్నీ, మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారిని గురించి రాశాను. ఇక మీ విషయంలో, ఆయన నుండి అందుకున్న అభిషేకం మీలో నిలిచి ఉంది కాబట్టి, ఎవ్వరూ మీకు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన అభిషేకం అన్నిటిని గూర్చి మీకు ఉపదేశం చేస్తుంది. ఆ అభిషేకం సత్యం. అది అబద్ధం కాదు. అది మీకు ఉపదేశం చేసిన విధంగా మీరు ఆయనలో నిలిచి ఉండండి. కాబట్టి పిల్లలూ, ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షం అయినప్పుడు, ఆయన ముందు సిగ్గుపాలు కాకుండా ధైర్యంతో నిలబడగలిగేలా ఆయనలో నిలిచి ఉండండి. ఆయన నీతిమంతుడు అని మీకు తెలుసు కాబట్టి, నీతిని అనుసరించే వారందరూ ఆయన వల్ల పుట్టినవారని కూడా మీకు తెలుసు.

