1 కొరింతీ పత్రిక 7:1-24

1 కొరింతీ పత్రిక 7:1-24 IRVTEL

ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి. అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి. ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు. ఏది ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు. నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను. అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది. ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు. ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు. మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే. అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు. మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను. ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు, ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది. ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస. ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు. సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.