1 కొరింతీ పత్రిక 15:33-58

1 కొరింతీ పత్రిక 15:33-58 IRVTEL

మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.” కాబట్టి మేల్కోండి! నీతి ప్రవర్తన కలిగి, పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గూర్చిన అవగాహన లేదు. మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను. అయితే “చనిపోయిన వారు ఎలా లేస్తారు? వారెలాటి శరీరంతో వస్తారు?” అని ఒకడు అడుగుతాడు. బుద్ధి హీనుడా, నీవు విత్తనం వేసినప్పుడు అది ముందు చనిపోతేనే కదా, తిరిగి బతికేది! నీవు పాతినది గోదుమ గింజైనా, మరి ఏ గింజైనా, వట్టి గింజనే పాతిపెడుతున్నావు గాని పైకి మొలిచే శరీరాన్ని కాదు. దేవుడే తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికీ దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు. అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఆకాశంలో వస్తువులున్నాయి, భూమి మీద వస్తువులున్నాయి. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు. నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల వెలుగు వేరు. ఒక నక్షత్రానికీ మరొక నక్షత్రానికీ వెలుగులో తేడా ఉంటుంది కదా. చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు. ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా, బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తినది ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. దీని గురించి, “ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు” అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు. మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరవాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి. మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే. మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు. ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు, “విజయం మరణాన్ని మింగివేసింది” అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి. “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?” మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి. కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.