1 కొరింతీ పత్రిక 14:21-40

1 కొరింతీ పత్రిక 14:21-40 IRVTEL

ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, “తెలియని భాషలు మాట్లాడే ప్రజల ద్వారా, తెలియని మనుషుల పెదవుల ద్వారా, ఈ ప్రజలతో మాట్లాడతాను. అయినప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెబుతున్నాడు.” కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించడం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన. సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకొంటారు కదా? అయితే అందరూ దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు, అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది. అప్పుడతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు. సోదరులారా, ఇప్పుడేం జరుగుతున్నది? మీరు సమావేశమైనప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని, ఇంకొకడు దేవుని మాటలు ఉపదేశించాలని చూస్తున్నాడు, వేరొకడు దేవుడు తనకు బయలు పరచిన దాన్ని ప్రకటించాలని చూస్తున్నాడు. ఒకడు తెలియని భాషతో మాటలాడాలని చూస్తుండగా మరొకడు దానికి అర్థం చెప్పాలని కనిపెడుతున్నాడు. సరే, అంతటినీ సంఘాభివృద్ధి కోసం జరిగించండి. ఎవరైనా తెలియని భాషతో మాట్లాడితే, ఇద్దరు, అవసరమైతే ముగ్గురికి మించకుండా, ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి. ఒకరు దానికి అర్థం చెప్పాలి. అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. అయితే అతడు తనతో, దేవునితో మాట్లాడుకోవచ్చు. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చు. మిగిలినవారు ఆ ఉపదేశాన్ని వివేచనాపూర్వకంగా వినాలి. అయితే అక్కడ కూర్చున్న మరొకనికి ఏదైనా వెల్లడి అయితే మొదటివాడు మౌనంగా ఉండాలి. అందరూ నేర్చుకొనేలా, ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకడి తరవాత ఒకడు దేవుడిచ్చిన సందేశం ప్రకటించ వచ్చు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాలు కలిగించే వాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో స్త్రీలు సంఘ సమావేశాల్లో మౌనంగా ఉండాలి. వారు లోబడి ఉండవలసిందే. వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది. వారు దేనినైనా తెలుసుకోవాలంటే వారి ఇంట్లో తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడడం అవమానకరం. ఏం, దేవుని వాక్కు మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరికి మాత్రమే వచ్చిందా? ఎవరైనా తాను ప్రవక్తననీ లేక ఆత్మీయ వ్యక్తిననీ భావిస్తే ఇక్కడ నేను మీకు రాస్తున్నవి ప్రభువు చెప్పిన ఆజ్ఞలని అతడు కచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైనా దీన్ని పట్టించుకోక పొతే అ వ్యక్తిని పట్టించుకోకండి. కాబట్టి నా సోదరులారా, దేవుడిచ్చిన సందేశం ప్రకటించడం అనే వరాన్ని ఆసక్తితో కోరుకోండి. తెలియని భాషలతో మాట్లాడటాన్ని ఆపకండి. అంతా మర్యాదగా, క్రమంగా జరగనీయండి.