కాబట్టి తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పే సామర్ధ్యం కోసం ప్రార్థన చేయాలి. నేను తెలియని భాషతో ప్రార్థన చేసినపుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనసు చురుకుగా ఉండదు. కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనసుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను. అలా కాకుండా, నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దాన్ని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు, “ఆమేన్” అని చెప్పలేడు కదా! నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గానీ ఎదుటి వ్యక్తికి మేలు కలగదు. దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను. అయినా సంఘంలో తెలియని భాషతో పదివేల మాటలు పలకడం కంటే, ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనసుతో ఐదు మాటలు చెప్పడం మంచిది. సోదరులారా, ఆలోచనలో చిన్న పిల్లల్లాగా ఉండవద్దు. చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గానీ ఆలోచించడంలో పరిణతి చెందినవారుగా ఉండండి. ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, “తెలియని భాషలు మాట్లాడే ప్రజల ద్వారా, తెలియని మనుషుల పెదవుల ద్వారా, ఈ ప్రజలతో మాట్లాడతాను. అయినప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెబుతున్నాడు.” కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించడం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన. సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకొంటారు కదా? అయితే అందరూ దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు, అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది. అప్పుడతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు.
చదువండి 1 కొరింతీ పత్రిక 14
వినండి 1 కొరింతీ పత్రిక 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింతీ పత్రిక 14:13-25
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు