ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం కోరుకోండి. ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు పలికేది ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలుకుతున్నాడు. అయితే దైవసందేశం ప్రకటించేవాడు వినేవారికి క్షేమాభివృద్ధి, ఆదరణ, ఓదార్పు కలిగే విధంగా మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని దైవసందేశం ప్రకటించేవాడు ఆదరణ, ఓదార్పు కలిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. మీరంతా తెలియని భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను గాని, మీరు దైవసందేశం ప్రకటించేవారుగా ఉండాలని మరెక్కువగా కోరుతున్నాను. సంఘం అభివృద్ధి చెందడానికి భాషలతో మాట్లాడే వాడి కంటే (అర్థం చెబితే తప్ప) దేవుని పక్షంగా దేవుడు తెలియ చేసిన సందేశాన్ని ప్రకటించే వాడే గొప్పవాడు. సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరికి భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. నా మాటలు మీకు అర్థం కాక, వాటిలో దేవుడు బయలు పరచిన విషయాలను గానీ, జ్ఞానం గానీ, దేవుడు చెప్పమన్న సందేశం గానీ, లేక ఎదైనా ఉపదేశం గానీ లేకుండా ఉంటే నా వలన మీకు ప్రయోజనమేమిటి? నిర్జీవమైన వస్తువులైన వేణువు ఊదినా, వీణ వాయించినా, అవి వేరు వేరు స్వరాలు పలకకపోతే, వాడిన వాయిద్యమేదో ఎలా తెలుస్తుంది? బాకా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? అలాగే మీ నాలుకతో స్పష్టమైన మాటలు పలకకపోతే వినేవారికి ఏం అర్థమౌతుంది? అది మీరు గాలితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా! లోకంలో ఎన్నో భాషలున్నా, వాటన్నిటికీ స్పష్టమైన అర్థాలు ఉంటాయి. మాటల అర్థం నాకు తెలియకపోతే మాట్లాడేవాడు నాకూ, నాకు అతడూ పరాయివారంగా ఉంటాం. మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయంలో ఆసక్తిగలవారు గనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను కోరుకుని వాటిలో అమితంగా అభివృద్ధి చెందండి. కాబట్టి తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పే సామర్ధ్యం కోసం ప్రార్థన చేయాలి. నేను తెలియని భాషతో ప్రార్థన చేసినపుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనసు చురుకుగా ఉండదు. కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనసుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను. అలా కాకుండా, నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దాన్ని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు, “ఆమేన్” అని చెప్పలేడు కదా! నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గానీ ఎదుటి వ్యక్తికి మేలు కలగదు. దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను. అయినా సంఘంలో తెలియని భాషతో పదివేల మాటలు పలకడం కంటే, ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనసుతో ఐదు మాటలు చెప్పడం మంచిది. సోదరులారా, ఆలోచనలో చిన్న పిల్లల్లాగా ఉండవద్దు. చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గానీ ఆలోచించడంలో పరిణతి చెందినవారుగా ఉండండి.
చదువండి 1 కొరింతీ పత్రిక 14
వినండి 1 కొరింతీ పత్రిక 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింతీ పత్రిక 14:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు