1 కొరింతీ పత్రిక 11:1-15

1 కొరింతీ పత్రిక 11:1-15 IRVTEL

నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి. మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను. మీరు తెలుసుకోవలసింది ఏమంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు. తన తల కప్పుకుని ప్రార్థన చేసే పురుషుడు తన తలను అవమానపరచినట్టే. తన తల కప్పుకోకుండా ప్రార్థన చేసే, లేక ప్రవచించే స్త్రీ తన తల అవమానపరచినట్టే. ఎందుకంటే అది ఆమె తల గొరిగించుకున్న దానితో సమానం. తన తల కప్పుకోని స్త్రీ తన తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకోవడం, లేక పూర్తిగా వెంట్రుకలు తీసివేయడం ఆమెకు అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి. పురుషుడు దేవుని పోలిక, ఆయన మహిమ. కాబట్టి అతడు తన తల కప్పుకోకూడదు. స్త్రీ పురుషుని మహిమ. అదెలాగంటే, స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు. కాబట్టి దేవదూతల కారణంగా స్త్రీకి తల మీద ఒక అధికార సూచన ఉండాలి. అయితే ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు. ఏ విధంగా స్త్రీ పురుషుని నుండి కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అయితే సమస్తమూ దేవునినుండే కలుగుతాయి. మీరే చెప్పండి. స్త్రీ తల కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరైనదేనా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపించడం లేదా? దేవుడు స్త్రీకి తల వెంట్రుకలు పైటచెంగుగా ఇచ్చాడు కాబట్టి ఆమె వాటిని పెంచుకోవడం ఆమెకు ఘనత అని మీకు స్వతహాగా తెలుసు కదా!