1 దిన 28:9-20

1 దిన 28:9-20 IRVTEL

సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు. పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి గుర్తించి ధైర్యంగా ఉండి, అది జరిగించు” అన్నాడు. అప్పుడు దావీదు మంటపానికీ, మందిర నిర్మాణానికి, గిడ్డంగులకు, మేడ గదులకూ, లోపలి గదులకూ, ప్రాయశ్చిత్త వేదిక ఉన్న గదికీ, యెహోవా మందిరపు ఆవరణాలకూ, వాటి చుట్టూ ఉన్న గదులకూ, దేవుని మందిర గిడ్డంగులకు, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులకు, తాను ఏర్పాటు చేసి సిద్ధం చేసిన నిర్మాణ ప్రణాళికలను తన కొడుకు సొలొమోనుకు అప్పగించాడు. యాజకులూ, లేవీయులూ, సేవ చెయ్యవలసిన వంతుల జాబితా, యెహోవా మందిరపు సేవను గూర్చిన జాబితా, యెహోవా మందిరపు సేవ ఉపకరణాల జాబితా దావీదు అతనికి అప్పగించాడు. ఇంకా, అనేక సేవాక్రమాలకు కావలసిన బంగారు ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం బంగారం, అనేక సేవాక్రమాలకు కావలసిన వెండి ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం వెండిని దావీదు అతనికి అప్పగించాడు. బంగారు దీపస్తంభాలకూ, వాటి బంగారు ప్రమిదెలకూ, ఒక్కొక్క దీపస్తంభానికీ, దాని ప్రమిదెలకూ కావలసినంత బంగారం తూకం ప్రకారంగా, వెండి దీపస్తంభాలకూ ఒక్కొక దీపస్తంభానికీ, దాని దాని ప్రమిదలకూ కావలసినంత వెండిని తూకం ప్రకారంగా, సన్నిధి రొట్టెలు ఉంచే ఒక్కొక బల్లకు కావలసినంత బంగారం తూకం ప్రకారంగా వెండి బల్లలకు కావలసినంత వెండినీ, ముళ్ళ కొంకులకూ, గిన్నెలకూ, పాత్రలకూ కావలసినంత స్వచ్ఛమైన బంగారం, గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకూ కావలసినంత బంగారం తూకం ప్రకారం, వెండి గిన్నెల్లో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని తూకం ప్రకారం, ధూపపీఠానికి కావలసినంత స్వచ్ఛమైన బంగారం తూకం ప్రకారం, రెక్కలు విప్పుకుని యెహోవా నిబంధన మందసాన్ని కప్పే కెరూబుల రూపకల్పనకు కావలసినంత బంగారం అతనికి అప్పగించాడు. ఇవన్నీ అప్పగించి “యెహోవా నాకిచ్చిన అవగాహన, నడిపింపును బట్టి ఈ నిర్మాణ ప్రణాళిక అంతా రాసి పెట్టాను” అని సొలొమోనుతో చెప్పాడు. ఇంకా దావీదు తన కొడుకు సొలొమోనుతో “నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పనికి పూనుకో. భయపడొద్దు, కంగారు పడొద్దు. నా దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. యెహోవా మందిర సేవను గూర్చిన పనంతా నువ్వు ముగించే వరకూ ఆయన నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టడు.