దావీదు తన కోసం దావీదు పట్టణంలో ఇళ్ళు కట్టించుకున్నాడు. దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి, అక్కడ ఒక గుడారం వేయించాడు. అప్పుడు దావీదు “మందసాన్ని మోయడానికీ నిత్యం ఆయనకు సేవ చెయ్యడానికీ యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నాడు, వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.
అహరోను సంతతి వారిని, లేవీయులను, కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఊరీయేలును, అతని బంధువుల్లో నూట ఇరవైమందిని, మెరారీయుల్లో వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో రెండువందల ఇరవై మందిని, గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో నూట ముప్ఫై మందిని, ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతి అయిన ఎలీయేలును, అతని బంధువుల్లో ఎనభై మందిని, ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మీనాదాబును, అతని బంధువుల్లో నూట పన్నెండు మందిని దావీదు సమావేశపరిచాడు.
అప్పుడు దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనే వాళ్ళతో “లేవీయుల పూర్వీకుల వంశాలకు మీరు పెద్దలుగా ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని మోయకపోవడం చేత, ఆయన దగ్గర విచారణ చేయక పోవడం చేత, ఆయన మనలో నాశనం కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు, మీవాళ్ళు, మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని, నేను ఆ మందసానికి సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావాలి” అన్నాడు. అప్పుడు యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము ప్రతిష్ట చేసుకున్నారు. తరువాత లేవీయులు యెహోవా చెప్పిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసాన్ని దాని మోత కర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.
అప్పుడు దావీదు “మీరు మీ బంధువులైన వాద్యకారులను పిలిచి, స్వరమండలాలు, తీగ వాద్యాలు, కంచు తాళాలతో ఉన్న వాద్యాలతో, గంభీర శబ్ధంతో, సంతోషంతో గొంతెత్తి పాడేలా ఏర్పాటు చెయ్యండి” అని లేవీయుల నాయకులకు ఆజ్ఞాపించాడు.