జెకర్యా 13:2-9

జెకర్యా 13:2-9 TELUBSI

ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు–ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకమురాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములోలేకుండచేతును. ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులు–నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు. వాడు–నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును. –నీచేతులకు గాయములేమని వారడుగగా వాడు–ఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా, నా గొఱ్ఱెల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు–గొఱ్ఱెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు. దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవభాగము వారు శేషింతురు. ఆ మూడవభాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆల కింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.