జెకర్యా 11

11
1లెబానోనూ, అగ్నివచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము. 2దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను; సరళవృక్షములారా, అంగలార్చుడి, చిక్కని అడవి నరక బడెను; సింధూరవృక్షములారా, అంగలార్చుడి. 3గొఱ్ఱె బోయల రోదన శబ్దము వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యొర్దానుయొక్క మహారణ్యము పాడైపోయెను. 4నా దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–వధకేర్పడిన గొఱ్ఱెల మందను మేపుము. 5వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని యనుకొందురు; వాటిని అమ్మినవారు– మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు; వాటిని కాయువారు వాటి యెడల కనికరము చూపరు. 6ఇదే యెహోవా వాక్కు– నేనికను దేశనివాసులను కనికరింపక ఒకరిచేతికి ఒకరిని, వారి రాజుచేతికి వారినందరిని అప్పగింతును, వారు దేశమును, నాశనముచేయగా వారి చేతిలోనుండి నేనెవరిని విడిపింపను. 7కాబట్టి నేను సౌందర్యమనునట్టియు#11:7 వేరొకభాషాంతరములో – కటాక్షము. బంధమనునట్టియు#11:7 సమకూర్చుట అనియున్నది. రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని. 8ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. 9కాబట్టి నేనికను మిమ్మును కాపుకాయను; చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి యొకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి 10సౌందర్యమను కఱ్ఱను తీసికొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగముచేయునట్లు దానిని విరిచితిని. 11అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని యున్న గొఱ్ఱెలు తెలిసికొనెను. 12–మీకు అనుకూలమైనయెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి. 13యెహోవా–యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. 14అప్పుడు బంధమనునట్టి నా రెండవ కఱ్ఱను తీసికొని యూదావారికిని ఇశ్రాయేలువారికిని కలిగిన సహోదరబంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని.
15అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా– ఇప్పుడు బుద్ధిలేని యొక కాపరి పనిముట్లను తీసికొమ్ము. 16ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవుచున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱెలను కనిపెట్టడు, చెదరిపోయినవాటిని వెదకడు, విరిగిపోయినదాని బాగుచేయడు, పుష్టిగా ఉన్నదాని కాపుకాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చేయుచుండును. 17మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

జెకర్యా 11: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి