రోమా 4:1-25

రోమా 4:1-25 TELUBSI

కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రా హాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆప్రకారమే క్రియలులేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు. ఏలాగనగా– తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చి కూడ చెప్పబడినదా? అబ్రాహాముయొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా? మంచిది; అది ఏ స్థితియందు ఎంచబడెను? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేనివారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను. మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారుగాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రా హామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను. ధర్మశాస్త్రసంబంధులు వారసులైనయెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిం చును; ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేక పోవును. ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సం తతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు– ఇందునుగూర్చి –నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది. –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడ వ్రాయ బడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

రోమా 4:1-25 కోసం వీడియో