రోమా 2:1-12

రోమా 2:1-12 TELUBSI

కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అనుకొందువా? లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రతదినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్‌క్రియను ఓపికగాచేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్క్యార్యముచేయు ప్రతిమనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. సత్‌క్రియచేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.

రోమా 2:1-12 కోసం వీడియో