రోమా 15:17-33

రోమా 15:17-33 TELUBSI

కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు. ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపెట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు, వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనైయుండి ఆలాగున ప్రకటించితిని. ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును అకయవారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి. అవును వారిష్ట పడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు. ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి, నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని యెరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికిచేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తునుబట్టియు, ఆత్మ వలని ప్రేమనుబట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్.

రోమా 15:17-33 కోసం వీడియో