మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు; రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును. –రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి–రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
చదువండి ప్రకటన 19
వినండి ప్రకటన 19
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ప్రకటన 19:11-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు