ప్రకటన 19:1-10

ప్రకటన 19:1-10 TELUBSI

అటుతరువాత బహుజనులశబ్దమువంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని– ప్రభువు ను స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతి దండన చేసెను; మరి రెండవసారి వారు– ప్రభువు ను స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి–ఆమేన్, ప్రభువు ను స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు–మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము–సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలు చున్నాడు; ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు–వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను.

ప్రకటన 19:1-10 కోసం వీడియో