ప్రకటన 18:4-24

ప్రకటన 18:4-24 TELUBSI

మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని–నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు. అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది–నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయా క్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు–అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదా రంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను, ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను, దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోధుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు; నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించి పోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు–అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి –ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు–అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పు కొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు. తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి–ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనచేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను. మరియు ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింప బడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.

ప్రకటన 18:4-24 కోసం వీడియో