ప్రకటన 17:3-14

ప్రకటన 17:3-14 TELUBSI

అప్పుడతడు ఆత్మ వశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేతపట్టుకొనియుండెను. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను–మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను–నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములునుగలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు; మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ యేడుగురితోపాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభు వులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

ప్రకటన 17:3-14 కోసం వీడియో