కీర్తనలు 71:1-16

కీర్తనలు 71:1-16 TELUBSI

యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు. నా దేవా, భక్తిహీనులచేతిలోనుండి నన్ను రక్షిం పుము. కీడుచేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి తల్లిగర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోను నీ ప్రభావవర్ణనతోను దినమంతయు నా నోరు నిండియున్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నా శత్రువులు నన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణముకొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. –దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన భంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను.