కీర్తనలు 18:20-50

కీర్తనలు 18:20-50 TELUBSI

నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను. నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందునువారిని నశింపజేయువరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురువారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ ద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితిని వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలుచేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్తాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు