కీర్తనలు 119:89-104

కీర్తనలు 119:89-104 TELUBSI

యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.