నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసికొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు. నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక యున్నాను. యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణచేయు చున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది. యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను. నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీ మాటచొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగకమునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను. నీవు దయాళుడవై మేలుచేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను. వేలకొలది వెండి బంగారు నాణెములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీచేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము. నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకువారు సిగ్గుపడుదురు గాక. నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను –నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు? నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము. భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.
చదువండి కీర్తనలు 119
వినండి కీర్తనలు 119
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 119:49-104
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు