యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్నురక్షింపుము. తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును. నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులనుబట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదువారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నియు నీయెదుట నున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచితిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.
చదువండి కీర్తనలు 119
వినండి కీర్తనలు 119
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 119:137-176
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు