కీర్తనలు 106:1-15

కీర్తనలు 106:1-15 TELUBSI

యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప గలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో షించుచు నీ స్వాస్థ్యమైనవారితోకూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరులవలెనే మేము పాపము చేసితిమి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగు బాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను. ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము లలో నడిపించెను. వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెనువారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.