సామెతలు 27:14-27

సామెతలు 27:14-27 TELUBSI

వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమానుడు. ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు. మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు. నీ పశువులస్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి యేరబడియున్నది నీ వస్త్రములకొరకు గొఱ్ఱెపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.