సామెతలు 23:1-18

సామెతలు 23:1-18 TELUBSI

నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు. నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును. ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినయెడల నా హృదయము కూడ సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.