సామెతలు 22:1-15

సామెతలు 22:1-15 TELUBSI

గొప్ప ఐశ్వర్యముకంటె మంచిపేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ మునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును. దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును. తిరస్కారబుద్ధిగలవాని తోలివేసినయెడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి –బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును. వేశ్య నోరు లోతైనగొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.