సామెతలు 14:25-34

సామెతలు 14:25-34 TELUBSI

నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపుఊట అది మరణపాశములలోనుండి విడిపించును జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.