సంఖ్యాకాండము 10

10
1యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు . రెండు వెండి బూరలు చేయించుకొనుము; 2నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను. 3ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. 4వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను. 5మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను. 6మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. 7సమాజమును కూర్చునప్పుడు ఊదవలెనుగాని ఆర్భాటము చేయవలదు. 8అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్యమైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. 9మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు. 10మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.
11రెండవ సంవత్సరము రెండవనెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి. 12తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. 13యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. 14యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. 15ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. 16జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి. 17మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి. 18రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. 19షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి. 20గాదీయుల గోత్రసైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి. 21కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచుసాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. 22ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. 23పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. 24గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనీయుల గోత్రసైన్యమునకు అధిపతి. 25దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషద్దాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి 26ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి. 27ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్యమునకు అధిపతి. 28ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయునప్పుడు తమతమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి.
29మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే–యెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా 30అందుకతడు–నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్లుదుననెను. 31అందుకు మోషే–నీవు దయచేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు. 32మరియు నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలుచేయుదుమనెను.
33వారు యెహోవా కొండనుండి మూడుదినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడుదినముల ప్రయాణములో యెహోవా నిబంధనమందసము వారికి ముందుగా సాగెను. 34వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను.
35ఆ మందసము సాగినప్పుడు మోషే–యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను. 36అది నిలిచినప్పుడు అతడు–యెహోవా, ఇశ్రాయేలు వేవేలమధ్యకు మరల రమ్మనెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 10: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి