నెహెమ్యా 6:1-9

నెహెమ్యా 6:1-9 TELUBSI

నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టియుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి–ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను–నేను చేయుపని గొప్పది, దానివిడిచి మీయొద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆప్రకారమే నేను మరల ప్రత్యుత్తరమిచ్చితిని. అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను. అందులో–వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్నుగూర్చి ప్రకటనచేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలును–రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును, –అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియనియు, దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండ మేమశక్తులమగుదుమనుకొని వారందరు మమ్మును బెదరింప జూచిరిగాని నేను–ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము.