మార్కు 9:1-13

మార్కు 9:1-13 TELUBSI

మరియు ఆయన – ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు దేవునిరాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు. మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు–బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను; వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా –ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా–మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు–ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి. అందుకాయన–ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి? ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను.