మార్కు 8:11-30

మార్కు 8:11-30 TELUBSI

అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి–ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను. ఆయన–చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు–తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి. యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా? నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారు–పండ్రెండని ఆయనతో చెప్పిరి. ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు – ఏడనిరి. అందుకాయన – మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి–నీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, వాడు కన్నులెత్తి – మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. అప్పుడు యేసు–నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా– నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను. అందుకు వారు–కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన–మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు–నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్నుగూర్చిన యీ సంగతి ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను.