మార్కు 6:45-56

మార్కు 6:45-56 TELUBSI

ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను. సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను. ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలువేసిరి. అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి– ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి; అయినను వారి హృదయము కఠిన మాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పెట్టిరి. వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపెట్టి ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్క డెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీదులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి.