వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకనుపరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింప సాగెను. చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది; చుట్టుపెట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమున కేమైనను కొనుక్కొనుటకు వారిని పంపి వేయుమని చెప్పిరి. అందుకాయన – మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు–మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలుకొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి. అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని –అయిదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి. అప్పుడాయన – పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని, ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను. వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి. ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను. సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను. ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలువేసిరి. అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి– ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి; అయినను వారి హృదయము కఠిన మాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పెట్టిరి. వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపెట్టి ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్క డెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీదులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి.
చదువండి మార్కు 6
వినండి మార్కు 6
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 6:33-56
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు