ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి–ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు–ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపెట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మలమీద వారి కధికారమిచ్చి –ప్రయాణముకొరకు చేతికఱ్ఱను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొన వద్దనియు వారికాజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను – మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని–బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడుగనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు –ఈయన ఏలీయా అనియు, మరికొందరు–ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని–నేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను–నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పెట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను. హేరోదియ అతని మీద పగపెట్టి అతని చంపింప గోరెను గాని ఆమెచేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను; ఎట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయదేశ ప్రముఖు లకును విందుచేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితోకూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజు–నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు–నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను గనుక ఆమె వెళ్లి –నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె–బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి–బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి యిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.
చదువండి మార్కు 6
వినండి మార్కు 6
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 6:1-29
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు