ఆయన సముద్రతీరమున మరల బోధింపనారం భింపగా, బహుజనులాయనయొద్దకు కూడివచ్చియున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుండెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి. ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను –వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను. –వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యులతోకూడ ఆయనచుట్టు ఉండినవారు ఆ ఉపమానమునుగూర్చి ఆయన నడిగిరి. అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను మరియు–ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును. అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగ గానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్ష లును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను.
Read మార్కు 4
వినండి మార్కు 4
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 4:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు