మార్కు 3:13-35

మార్కు 3:13-35 TELUBSI

ఆయన కొండ యెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతోకూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను. వారెవరనగా–ఆయన పేతురను పేరుపెట్టిన సీమోను జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పెట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను– సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడినయెడల, ఆ యిల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడినయెడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించినయెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములును మనుష్యులుచేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పెట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన–నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి– ఇదిగో నా తల్లియు నా సహోదరులును; దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను.

మార్కు 3:13-35 కోసం వీడియో