మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని–అదిగో ఏలీయాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చునేమో చూతమనెను. అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను. ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి–నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్ర్తీలనేకులును వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతిదినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు. పిలాతు – ఆయన ఇంతలోనే చని పోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తనయొద్దకు పిలిపించి–ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను. శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను. అతడు నారబట్టకొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.
Read మార్కు 15
వినండి మార్కు 15
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 15:33-47
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు