మార్కు 15:16-23

మార్కు 15:16-23 TELUBSI

అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనినతరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తలమీదపెట్టి, –యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి. వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతముచేసిరి. అతడు అలెక్సంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు.