మార్కు 14:12-21

మార్కు 14:12-21 TELUBSI

పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమునవారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులు–నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ వలెనని కోరుచున్నావని ఆయన నడుగగా, ఆయన –మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును; వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి–నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతోకూడ వచ్చెను. వారు కూర్చుండి భోజనముచేయుచుండగా యేసు–మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి–నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన – పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే. నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను.