మార్కు 14:1-25

మార్కు 14:1-25 TELUBSI

రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ, అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను. అప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొనుచుండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను. అయితే కొందరు కోపపడి – ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల? ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను – ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలుచేయ వచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను. ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులచేతికి ఆయనను అప్పగింపవలెనని వారియొద్దకు పోగా వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను. పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమునవారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులు–నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ వలెనని కోరుచున్నావని ఆయన నడుగగా, ఆయన –మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును; వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి–నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతోకూడ వచ్చెను. వారు కూర్చుండి భోజనముచేయుచుండగా యేసు–మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి–నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన – పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే. నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను. వారు భోజనముచేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి–మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన –ఇది నిబంధనవిషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.