మార్కు 12:28-37

మార్కు 12:28-37 TELUBSI

శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి–ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు . నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను ఆ శాస్త్రి–బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి–నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా –క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నా రేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను. దావీదు ఆయ నను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.