మార్కు 12:1-12

మార్కు 12:1-12 TELUBSI

ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారం భించెను; ఎట్లనగా – ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురముకట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరముపోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసునిపంపగా వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి. మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి. అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులను పంపగా, వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక–వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు–ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు –ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా తమ్మునుగూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.