మార్కు 11:1-19

మార్కు 11:1-19 TELUBSI

వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి –మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు; దానిని విప్పి, తోలుకొని రండి. ఎవడైనను– మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్ము నడిగినయెడల–అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా, అక్కడ నిలిచియున్న వారిలో కొందరు– మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి. అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగుననుపరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలనుపరచిరి. మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండుమందితోకూడ బేతనియకు వెళ్లెను. మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు. అందుకాయన–ఇకమీదట ఎన్నటి కిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను ; ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. మరియు ఆయన బోధించుచు –నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.

మార్కు 11:1-19 కోసం వీడియో