మార్కు 10:32-45

మార్కు 10:32-45 TELUBSI

వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి – ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడుదినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన–నేను మీకేమి చేయగోరుచున్నారని వారి నడిగెను. వారు–నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి. యేసు–మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట యైనను మీచేత అగునా? అని వారి నడుగగా వారు–మా చేత అగుననిరి. అప్పుడు యేసు–నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, గాని నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను. తక్కినపదిమంది శిష్యులు ఆ మాట విని, యాకోబు యోహానులమీద కోపపడసాగిరి. యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను–అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరినయెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరినయెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.