మార్కు 10:17-27

మార్కు 10:17-27 TELUBSI

ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని–సద్బోధ కుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. యేసు–నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను. అందుకతడు–బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి–నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను. అప్పుడు యేసు చుట్టు చూచి–ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను– పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము; ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి– అట్లయితే ఎవడు రక్షణపొంద గలడని ఆయన నడిగిరి. యేసు వారిని చూచి–ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.