ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి: ఆయన తనవాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై–పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి. అందుకాయన–మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారి నడిగెను. వారు–పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా యేసు–మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి. అందుకాయన–తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి–చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని–సద్బోధ కుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. యేసు–నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను. అందుకతడు–బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి–నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను. అప్పుడు యేసు చుట్టు చూచి–ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను– పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము; ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి– అట్లయితే ఎవడు రక్షణపొంద గలడని ఆయన నడిగిరి. యేసు వారిని చూచి–ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు ఇదిగో–మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను–నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలి దండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.
Read మార్కు 10
వినండి మార్కు 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 10:1-31
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు